మాకు చెత్త ఇవ్వండి …మేం మీకు ఓ పిజ్జా ఇస్తాం! …మీ ఫోన్ను రీచార్జ్ చేసి పెడతాం! …మీకు ఆన్లైన్ షాపింగ్ కూపన్లు ఇస్తాం!

మాకు చెత్త ఇవ్వండి
…మేం మీకు ఓ పిజ్జా ఇస్తాం!
…మీ ఫోన్ను రీచార్జ్ చేసి పెడతాం!
…మీకు ఆన్లైన్ షాపింగ్ కూపన్లు ఇస్తాం!
– ఎవరైనా ఇలాంటి ఆఫర్లు ఇస్తే, వాళ్లను పిచ్చివాళ్లనుకోవడం ఖాయం.
అడిగిందే తడవు బకెట్లకు బకెట్లు చెత్త చేతికిచ్చి, వాళ్లిచ్చే పిజ్జాలు, కూపన్లు అందుకుంటాం.
కానీ..ఈ ఆఫర్ ఇస్తున్నది పిచ్చివాళ్లు కాదు… పర్యావరణ ప్రేమికులు. దేశాన్ని వ్యర్థాల బారినుంచి, పర్యావరణ కాలుష్యంనుంచి రక్షించాలనుకుంటున్న మంచివాళ్లు!
అశుతోష్ శ్రీవాస్తవ, ప్రణవ్ మనోచా, మరో ఐదుగురు కుర్రాళ్లు. అందరూ ఢిల్లీలోని భాస్కరాచార్య కాలేజ్ ఆఫ్ అప్లయిడ్ సైనె్సస్నుంచి పట్టా పుచ్చుకున్నారు. డిగ్రీ రాగానే ఉద్యోగ వేటలో పడకుండా వ్యర్థాల రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టారు. రెండేళ్లపాటు పరిశోధన చేశాక ‘ఉయ్ కన్వర్ట్’ అనే సంస్థను ఏర్పాటు చేసి, ఆ పేరు మీదే ఢిల్లీలోని పలు చోట్ల వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. ఈ మెషీన్లో చెత్త వేస్తే… పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి, నిల్వ చేస్తుంది. దానిని ఉయ్ కన్వర్ట్ కార్యకర్తలు కలెక్ట్ చేసి, రీసైకిల్ చేస్తారు. అయితే ఊరికే వెండింగ్ మెషీన్లలో చెత్త వేయమంటే ఎవరు వేస్తారు? దానికో చిట్కా కనిపెట్టారు. వేసిన చెత్తను లెక్క కట్టి పిజ్జా, ఆన్లైన్ షాపింగ్ కూపన్లు, ఫోన్లకు రీచార్జ్ బిల్లులు వంటి రివార్డులు ఇస్తారు. దీనికి వెండింగ్ మెషీన్లోనే వెసులుబాటు ఉంది.
ఈ రివార్డులకోసం ఉయ్ కన్వర్ట్…అనేక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఏర్పాటు చేసిన వెండింగ్ మెషీన్ల ద్వారా రోజుకు సగటున పది కేజీల చెత్త లభిస్తోంది. ఐదువేల మంది వినియోగదారులు ఉయ్ కన్వర్ట్ వెండింగ్ మెషీన్లను వినియోగిస్తున్నట్టు అంచనా. ఇప్పటివరకూ ఉయ్ కన్వర్ట్ 700 కేజీల వ్యర్థాలను రీసైకిల్ చేసింది. ఏటా రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తోంది. త్వరలోనే హైదరాబాద్, ముంబయి, పుణె, బెంగళూరు వంటి నగరాలకూ తమ వ్యాపారాన్ని విస్తరించాలని అశుతోష్ మిత్రబృందం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *