ప్రతివ్యక్తి జీవితమూ అమూల్యమైనదే

ఓ గురువు దగ్గరకు శిష్యుడు వెళ్లాడు. గురూజీ మనిషి జీవితం విలువ ఎంత అని అడిగాడు. ఆ గురువు శిష్యుడి చేతిలో ఓ రాయి ఉంచి.. దీని విలువెంతో తెలుసుకుని రమ్మన్నాడు. రాయిని ఎట్టిపరిస్థితిల్లోనూ అమ్మకూడదని షరతు విధించాడు. గురువాజ్ఞ మేరకు ఆ శిష్యుడు రాయిని తీసుకుని బయల్దేరాడు. ముందుగా ఓ పళ్లవ్యాపారికి ఆ రాయిని చూపి ‘దీని విలువ ఎంతుంటుంది’ అని అడిగాడు. ‘ఓ డజను అరటి పళ్లు ఇవ్వొచ్చు’ అని బదులిచ్చాడు పళ్ల వ్యాపారి. ఓ కూరగాయల వ్యాపారి దగ్గరికెళ్లి రాయి విలువ ఎంతో చెప్పమన్నాడు. ‘రాయిని చూసి బస్తా బంగాళదుంపలు ఇవ్వొచ్చు’ అని అన్నాడు. ఇంకాస్త ముందుకెళ్తే.. ఓ బంగారం వ్యాపారి తారసపడ్డాడు. అతడికీ ఆ రాయిని చూపి దీని విలువ ఎంత ఉండొచ్చు అని అడిగాడు శిష్యుడు.
ఆ వ్యాపారి రాయిని అటు ఇటూ చూసి.. ‘అయ్యా ఇది విలువైన వస్తువు.. ఇది కోటి రూపాయలకు పైగా పలుకుతుంది’ అని బదులిచ్చాడు. చివరకు వజ్రాల వ్యాపారికి ఆ రాయిని చూపించాడు. ‘దాన్ని పరిశీలించిన వజ్రాల వ్యాపారి ఇది అత్యంత ఖరీదైనది. దీనికి విలువ కట్టలేము’ అని బదులిచ్చాడు. అక్కడి నుంచి ఆ శిష్యుడు నేరుగా తన గురువు ఆశ్రమానికి చేరుకున్నాడు. రాయి విలువ ఎలా పెరుగుతూ పోయిందో గురువుకు చెప్పాడు. దీనికి జీవితానికి సంబంధం ఏంటని అడిగాడు శిష్యుడు.

గురువు చిరునవ్వుతో.. ‘‘ప్రతి మనిషి రత్నంలాంటి వాడే. కాకపోతే ఒక్కోక్కరూ ఒక్కో విధంగా అంచనా వేస్తారు. తక్కువగా చూశారని చింతించాల్సిన పనిలేదు. ప్రతివ్యక్తి జీవితమూ అమూల్యమైనదే. మనలోని ప్రతిభను గుర్తించే రోజూ వస్తుంది. అప్పటి వరకు కర్తవ్య దీక్షతో సాగడమే మనిషి దగ్గరున్న ప్రత్యామ్నాయం’’ అని బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *